అనుమ‌తి లేని లే అవుట్ల‌లోని ప్లాట్ల‌కు నో రిజిస్ట్రేష‌న్‌

స‌ర్పంచ్‌ల‌కు, వార్డు మెంబ‌ర్ల‌కు సిట్టింగ్ ఫీజు

పంచాయ‌తీల్లో కో అప్ష‌న్ స‌భ్యుడిగా ఎన్ ఆర్ ఐల‌కూ ఛాన్స్‌

భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల కోసం మండ‌ల స్థాయిలోనూ క‌మిటీ

హెచ్ ఎండీఏ అనుమ‌తిచ్చిన వారం రోజుల్లోనే భ‌వ‌న నిర్మాణానికి పంచాయ‌తీ క్లియ‌రెన్స్

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు పంచాయ‌తీల అనుమ‌తి అక్క‌ర్లేదు

ప్ర‌జ‌ల హ‌క్కుల జాబితాను చ‌ట్టంలో పొందుప‌ర్చే యోచ‌న‌

నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంపై మంత్రుల స‌బ్ కమిటీ సుదీర్ఘ చ‌ర్చ‌

ప్ర‌త్యేకంగా హాజ‌రైన డిప్యూటీ సీయం మ‌హ‌మూద్ అలీ

మూడోరోజు ఎనిమిది గంట‌ల పాటు జ‌రిగిన చ‌ర్చ‌లో అనేక అంశాల ప్ర‌స్తావ‌న‌

హైద‌రాబాద్‌- అనుమ‌తి లేని లేఅవుట్ల‌లోని ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటే ఎలా ఉంటుంద‌నే దానిపై పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఆలోచ‌న చేస్తోంది. ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో బుధ‌వారం మూడో రోజూ స‌మావేశ‌మైన మంత్రుల స‌బ్ క‌మిటీ దాదాపు ఎనిమిది గంట‌ల పాటు అనేక అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించింది. స‌బ్ క‌మిటీ స‌భ్యులైన మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి, ఈటెల రాజేంద‌ర్ తో పాటు జ‌గ‌దీశ్ రెడ్డి కూడా చ‌ర్చ‌లో పాల్గొన్నారు. అనుమ‌తి లేని లే అవుట్ల‌లో ప్లాట్ల రిజిస్ట్రేష‌న్‌ను ఆపి వేస్తే ఎలా ఉంటుంద‌న్న అంశంపై సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీయం మ‌హ‌మూద్ అలీతోనూ స‌బ్ క‌మిటీ ప్ర‌త్యేకంగా చ‌ర్చించింది. ఎలాంటి అనుమ‌తి లేకుండా లే అవుట్లు చేస్తూ విచ్చ‌ల‌విడిగా ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్లు
చేస్తున్నార‌ని…దీనివ‌ల్ల సామాన్యులు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని స‌బ్ క‌మిటీ స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. లే అవుట్‌కు అనుమ‌తి ఉంటేనే  ప్లాట్ల‌కు రిజిస్ట్రేష‌న్ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటే మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్తం అయింది. ప్ర‌స్తుతం జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్‌ల్లో ఉన్న‌ట్లుగానే పంచాయ‌తీ పాల‌క‌వ‌ర్గ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే స‌భ్యుల‌కు కూడా సిట్టింగ్ ఫీజు ఇవ్వాల‌నే అభిప్రాయం కూడా వ్య‌క్తం అయింది. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో మిన‌హా వ‌రుస‌గా మూడు సార్లు పాల‌క‌వ‌ర్గ స‌మావేశాల‌కు డుమ్మా కొడితే అన‌ర్హ‌త వేటు కూడా వేసే విష‌యంపై చ‌ర్చించారు.

పంచాయ‌తీల్లో కో ఆప్ష‌న్ స‌భ్యులను నియ‌మించే అంశాన్ని ప‌రిశీలిస్తున్న స‌బ్ క‌మిటీ…ఇందులో ఎన్ ఆర్ ఐల‌కు…గ్రామంలో లేని వారికి కూడా అవ‌కాశం ఇస్తే ఎలా ఉంటుంద‌న్న దానిపై చ‌ర్చించారు. అలాగే పంచాయ‌తీలోని జ‌నాభాను బ‌ట్టి ఇద్ద‌రు, ముగ్గురిని కూడా నామినేట్ చేసుకునే అవ‌కాశాల‌పై క‌మిటీ స‌భ్యులు చ‌ర్చించారు. ఇందులో గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐలు, గ్రామ  మ‌హిళ స‌మాఖ్య అధ్య‌క్షురాలు, నిపుణుల‌కు అవకాశం క‌ల్పించ‌డం వ‌ల్ల గ్రామ అభివృద్ధికి వారి స‌హ‌కారం ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అయింది. 200 చ‌ద‌ర‌పు గ‌జాల లోపు విస్తీర్ణంలో జీ ప్ల‌స్ 2 ఎత్తులో నిర్మించే భ‌వ‌నాల అనుమ‌తులను గ్రామ‌పంచాయ‌తీలో ఇస్తుండ‌గా…అంత‌క‌న్నా ఎక్కువ విస్తీర్ణంలో అయితే మండ‌లాల్లోనూ ఎంపీడీఓ, త‌హ‌సీల్డార్‌, ఈఓ పీఆర్డీ, పంచాయ‌తీరాజ్ ఏఈల నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటు చేసి అనుమ‌తించే అంశంపైనా చ‌ర్చించారు. అలాగే భ‌వ‌న నిర్మాణానికి హెచ్ ఎండీఏ అనుమ‌తిచ్చిన వారం రోజుల్లోనే పంచాయ‌తీ క్లియ‌రెన్స్ ఇవ్వాల‌ని…లేని ప‌క్షంలో అది అనుమ‌తిచ్చిన‌ట్లుగానే భావించాల్సి ఉండేలా చ‌ట్టంలో పొందుప‌ర్చే అంశం కూడా స‌బ్ క‌మిటీ బేటీలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అలాగే ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు సంబంధించి పంచాయ‌తీల నుండి  అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా చ‌ట్టంలో పొందుప‌ర్చే అంశంపైనా చ‌ర్చించారు. అటు సర్పంచ్‌ల‌కు విస్తృత అధికారాలు క‌ల్పించే దిశ‌గా కొత్త చ‌ట్టంలో మార్పులు చేయాల‌నిభావిస్తున్న స‌బ్ క‌మిటీ…అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కోసం ప్ర‌త్యేకంగా హ‌క్కుల జాబితాను కూడా చ‌ట్టంలో పొందుప‌ర్చే యోచ‌న చేస్తోంది. ప్ర‌ధానంగా డంప్‌యార్డులు, వైకుంట‌దామాలు, పారిశుద్యం లాంటివి ప్ర‌జ‌ల హ‌క్కులుగా చ‌ట్టంలో పెట్టే అంశాన్ని చ‌ర్చించారు. గురువారం కూడా స‌బ్ క‌మిటీ మ‌రోసారి స‌మావేశం కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *