Breaking News

అనంతగిరి రిజర్వాయరు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

అనంతగిరి రిజర్వాయరు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

భూనిర్వాసితులకు అండగా ప్రభుత్వం.

ఏడాదిలో అనంతగిరి,రంగనాయకి సాగర్ పూర్తి

కెసిఆర్ సూచనల మేరకు పునరావాస కాలనీలు.

రైతుబిడ్డ కెసిఆర్ కే రైతుల కష్టాలు తెలుసు.

– మంత్రి హరీశ్ రావు.

ప్రాజెక్టులను అడ్డుకోవడమంటే రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించడమేనని ఆయన విశ్లేషించారు. ప్రతిపక్షాల తీరుపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రైతుల శ్రేయస్సు కోరేవారెవరూ ప్రాజెక్టులను అడ్డుకోబోరని అన్నారు.కేసుల మీద కేసులు వేస్తూ, ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ 10లో మిడ్ మానేరు కు అనుసంధానంగా జరుగుతున్న టన్నెల్ పనులు,  అనంతగిరి రిజర్వాయరు నిర్మాణ పనులను మంగళవారం మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. సిద్ధిపేట జిల్లా శివారు, రాజన్న-సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పారం గ్రామంలో ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ సర్జిఫుల్ సంప్ హౌస్ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతగిరి రిజర్వాయరు 10వ ప్యాకేజి టన్నెల్ పనులు, సర్జిఫుల్ పంప్ హౌస్ నిర్మాణ పనులు
పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.సర్జికల్ పంప్ హౌస్, టన్నెల్ నిర్మాణ పనులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులకు మంత్రి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.రిజర్వాయరులో మిగిలిన పనులకు సంబంధించిన పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కోరారు .నిర్ణీత సమయంలోపు అన్ని పనులు పూర్తి చేసి నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి సూచించారు. రైతు సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు.స్వయంగా రైతు బిడ్డ అయినందున ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల బాధలు, సాధక- బాధకాలు అన్ని తెలుసని హరీశ్ రావు చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే మరెక్కడా లేని విధంగా అనంతగిరి రిజర్వాయరులో 95 మీటర్ల ఎత్తు, 56 మీటర్ల వెడల్పుతో ఓపెన్ సర్జిఫుల్ పంప్ హౌస్ నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకునే రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసి నీటిని ఎస్సారెస్పీ నుంచి నిజామాబాదు, వరంగల్,యాద్రాద్రి జిల్లాలకు సాగునీరు అందిస్తామని మంత్రి వివరించారు.

harish rao 1

మరో టీఎంసీ నీటిని పైకి తెచ్చి అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను నింపి వాటి ద్వారా రాజన్న- సిరిసిల్లా, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సాగు నీరు అందిస్తామని మంత్రి చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా సిద్ధిపేట- రాజన్న- సిరిసిల్లా జిల్లా సరిహద్దులో నిర్మిస్తున్న అనంతగిరి, రంగ నాయక సాగర్ ప్రాజెక్టు పనులను ఏడాదిలోగా పూర్తి చేయిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి అయ్యాయని, ఇంకా 60వేల క్యూబిక్ మీటర్ల మట్టి పని మిగిలి ఉన్నదని, గ్రామస్తుల సహకారంతో 3 బండ్ పనులు పూర్తి చేశామని మంత్రి వివరించారు. అనంతగిరి రిజర్వాయరు విషయంలో సబ్ స్టేషన్ కావాలని, దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతామని మంత్రి పేర్కొన్నారు.భూ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉన్నదని, ఇళ్లకు నష్ట పరిహారాన్ని అందజేస్తున్నామని హరీశ్ రావు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనలతో నిర్వాసితుల కోరిక మేరకు ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణాలు సైతం చేపడుతున్నామని ఆయన చెప్పారు.నిర్వాసితులకు శాశ్వత ఆదాయ వనరులు కల్పించేలా ప్రభుత్వం తరపున గట్టి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.ప్రాజెక్టులను అడ్డుకునే వాళ్లు నిస్సందేహంగా రైతు వ్యతిరేకులని అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం అంటే రైతులను నష్టపరిచే విధంగా చేయడమని మంత్రి స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఎవ్వరూ ఇవ్వని విధంగా రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు పాటు పడుతున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు.మంత్రి వెంట కాళేశ్వరం సీ.ఈ. హరిరాం, ఎస్.ఈ వేణు, ఈ.ఈ ఆనంద్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

harish rao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *