అధిక ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది: అసెంబ్లీలో కడియం శ్రీహరి

 

       

        ప్రొఫెసర్ తిరుపతిరావు అధ్యక్షతన కమిటీ వేసింది. కమిటీ నివేదిక రాగానే చర్యలు

        గతంలో ఇచ్చిన జీవోలను ప్రభుత్వం కొట్టి వేయడం వల్ల ఫీజుల నియంత్రణ జరగలేదు

        ఫీజుల నియంత్రణకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

        వచ్చే ఏడాది విద్యా సంవత్సరం అడ్మిషన్లు ఇప్పుడే చేస్తే అవి చెల్లవు

        అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడి

 

హైదరాబాద్, నవంబర్ 09 : ప్రైవేట్ అన్ ఎయిడెడ్, ఇంటర్నేషనల్ కార్పోరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వీటిని నియంత్రణ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కార్పోరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల ఫీజుల క్రమబద్దంపై సభ్యులు సంపత్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనసభలో సమాధానం చెప్పారు. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని, ఇందులో దాచేది ఏమీ లేదన్నారు. ఈ ఫీజులను నియంత్రించేందుకు గత ప్రభుత్వాలు కూడా కొంత ప్రయత్నం చేసి నాలుగు జీవోలు తీసుకొచ్చాయన్నారు. అయితే కోర్టులు వీటిని కొట్టివేయడంతో ఫీజుల వసూలు అలాగే ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఫీజుల వసూళ్లను నియంత్రించేందుకు మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు అధ్యక్షతన కమిటీ వేసిందన్నారు. ఈ కమిటీ తన నివేదికను ఈ నెలాఖరులో ఇస్తుందని చెప్పారు. సభ్యుడు సంపత్ కుమార్ చెప్పినట్లు జీవో 91 అమలు చేయడానికి వీలు లేదని, దీనిని హైకోర్టు కొట్టి వేసిందన్నారు. దీని తర్వాత వచ్చిన జీవో 42 ప్రకారం జిల్లాల్లో జిల్లా స్థాయి ఫీజు నియంత్రణ కమిటీలు వేద్దామని ఇచ్చిన ఉత్తర్వులను కూడా యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో దానిని కొట్టి వేశారన్నారు. దీంతో ప్రొఫెసర్ తిరుపతిరావు ఆధ్వర్యంలో కమిటీ వేశామని, ఈ కమిటీ విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలతో పలుమార్లు సమావేశమైందన్నారు. ఈ నెలాఖరులో కమిటీ తన నివేదిక ఇస్తుందని, నివేదికను అనుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ఇక వచ్చే ఏడాదికి సంబంధించి ఇప్పటి నుంచే అడ్మిషన్లు చేపట్టడంపై కూడా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇచ్చారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో చేపట్టవద్దని పాఠశాలలు, కాలేజీలకు చెప్పామన్నారు. అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వకుండా అంతకుముందు చేపట్టే అడ్మిషన్లు చెల్లవన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *