
|
తాబేలు కుందేలు కథ తెలుసుగా. అతి తెలివికి పోయిన కుందేలుమీద తాబేలు గెలిచిందట. అది మనం చిన్నప్పుడు చదువుకున్న కథ. ఇక్కడ ఓ తాబేలు మాత్రం కుందేలులా మాంచి స్పీడుగా నడుస్తుందని క్రెడిట్ కొట్టేసింది. వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు, గిన్నిస్ బుక్ వారు కూడా దీని నడక వేగం ప్రపంచ రికార్డని కితాబిచ్చారు. దాని యజమానికి ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు.
దక్షిణాఫ్రికాకు చెందిన బెర్టీ అనే తాబేలు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. గంటకు 0.6 మైళ్ల దూరం నడిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అప్పుడెప్పుడో 1977లో యూకేకు చెందిన ఓ తాబేలు నెలకొల్పిన రికార్డు ఇప్పుడు భళ్లున బద్దలై పోయింది. తన కల నిజమైందని బెర్టీ యజమాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు.
బెర్టీ స్పీడును చూసిన వారు ప్రపంచ రన్నింగ్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ తో పోలుస్తున్నారు. ఇది తాబేళ్లలో బోల్ట్ అని చమత్కరిస్తున్నారు. మరి కొందరేమో కుందేలుతో పోటీ పడే తాబేలు అని కితాబిస్తున్నారు. మొత్తం మీద ఈ తాబేలు రికార్డు దాని యజమానిని ఓ సెలెబ్రిటీగా మార్చేసింది. గిన్నిస్ బుక్ లో మరో కొత్త రికార్డు నమోదైంది.