
*పులులతో సహా ప్రతీ వన్యప్రాణికి జీవించే హక్కు ఉంది*
*అటవీ సంపద రక్షణ, పర్యావరణ సమతుల్యతే మానవ మనుగడకు జీవం*
*అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణకు ఆధునిక సాంకేతికత జోడించాలి*
*ఎకో టూరిజం అమలులో సహజ అడవికి హాని జరగకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి*
*వైల్డ్ లైఫ్ వీక్ ఉత్సవాల్లో భాగంగా అరణ్య భవన్ సెమినార్ లో పాల్గొన్న నిపుణులు*
*వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణంపై సెమినార్ లో పాల్గొన్న డైరెక్టర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సోసైటీ డాక్టర్ ఉల్లాస్ కరంత్,
కార్బెట్ , రాజాజీ జాతీయ వనాల మాజీ ఫీల్డ్ డైరెక్టర్ సమీర్ సిన్హా*
దేశంలో పులుల సంరక్షణలో పాటిస్తున్న పద్దతులు, అనుసరిస్తున్న విధానాలు, కొత్త టెక్నాలజీ ప్రయోగాలపై అరణ్య భవన్ లో జరిగిన సెమినార్ లో నిపుణులు ప్రసంగించారు. పెద్ద పులుల సంరక్షణలో ప్రభుత్వాలు, ప్రజలు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంపై విశ్లేసించారు. పులితో సహా ప్రతీ వన్య ప్రాణికి భూమిపై జీవించే హక్కు ఉందని, వాటిని కాపాడటంతోనే పర్యావరణ సమతుల్యత కూడా ముడిపడి ఉందన్నారు. ప్రజా ఆవాసాలు, వన్యప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల్లో భాగంగా, రిజర్వు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను బయట ప్రాంతాలకు తరలించటం, వారికి సరైన పునరావాసం ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. పులుల సంఖ్యలను పెంచాలంటే అవి ఆధారపడే శాఖాహార జంతువుల సంఖ్యను అడవుల్లో పెంచాల్సిన అవసరం ఉందని సెమినార్ లో పాల్గొన్న డాక్టర్ ఉల్లాస్ కరంత్ అభిప్రాయపడ్డారు. ఒక అంచనా ప్రకారం ఒక చదరపు కిలోమీటరకు కనీసం 15 నుంచి 20 శాఖాహార జంతువులు ఉండాలన్నారు. అప్పుడే పెద్ద పులులకు ఆవాసంగా అడవి మారుతుందన్నారు. వంద చదరపు కిలో మీటర్ల అడవీ ప్రాంతంలో రెండు నుంచి మూడు పెద్ద పులులు సంచరించే పరిస్థితులు ఉంటే మంచి అటవీ సమతుల్యత ఉన్నట్లుగా భావించాలన్నారు. తెలంగాణలో ఉన్న అటవీ ప్రాంతాలు ముఖ్యంగా కవ్వాల్, అమ్రాబాద్ రక్షిత ప్రాంతాలు పులుల సంచారానికి అనువైన వాతావరణం ఉందన్నారు, ఆ దిశగా అటవీ శాఖ సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పులుల సంరక్షణకు కృత్రిమ పద్దతులు కాకుండా, సహజమైన అడవిని సాధ్యమైనంతగా రక్షించాలన్నారు. పులుల జన గణన కోసం ఆధునిక కెమెరా ట్రాప్ లు, పెంటికల సేకరణ, విశ్లేషణ ద్వారా నిర్ణయించ వచ్చన్నారు. ఏటా 20 నుంచి 23 శాతం దాకా అటవీ జంతువుల సహజ మరణాలు, వలసలు ఉండటం సహజమనీ, ఆ మేరకు పునరుత్పత్తి కూడా ఉంటుందని, దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అయితే అదే సమయంలో వేట, సహజ ఆవాసాలను దెబ్బతీయటం వల్ల జరిగే జంతు మరణాలను నియంత్రించాలని కోరారు.
వైల్డ్ లైఫ్ నేరాలు, నియంత్రణపై సుదీర్ఘ అనుభవం ఉన్న సమీర్ సిన్హా మాట్లాడుతూ.. దేశంలో అత్యంత రహస్యంగా కోట్లాది రూపాయల విలువైన వన్య ప్రాణుల శరీర భాగాల వేట, స్మగ్లింగ్ జరుగుతోందని, దీనిని నియంత్రించకపోతే రానున్న రోజుల్లో దేశంలో వన్య ప్రాణుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అంతర్జాతీయ ఈ జాడ్యం పెరుగుతోందన్నారు. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన జంతువుల అవశేషాలతో అక్రమ వ్యాపారం జరుగుతోందని, వీటి మూలాలు దేశంలో కూడా ఉన్నందున, వాటిని అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఎన్ని ఆధునిక పద్దుతులు ఉన్నప్పటికీ అటవీ ప్రాంతాల్లో సిబ్బంది నిరంతర కాలి నడకన పర్యవేక్షణ చేస్తేనే వేట, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ గా మారిన ఎకో టూరిజం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని, అత్యంత జాగ్రత్తగా ఎకో టూరిజం ఎంపిక, నిర్వహణ జరగకపోతే అటవీ రక్షణలో మొదటికే మోసం వస్తుందన్నారు. ఎకో టూరిజం వల్ల తలెత్తే కాలుష్యం, చెత్త వల్ల సహజ అడవులకు ప్రమాదం పొంచివుందని, ఆ దిశగా అటవీ శాఖ సరైన చర్యలు తీసుకోవాలన్నారు. వన్యప్రాణ చట్టాలు, క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలపై అటవీ అధికారులకు, సిబ్బందికి తగిన అవగాహన, శిక్షణ ఉండాలన్నారు. పోలీసు శాఖ వాడుతున్న డాగ్ స్వ్యాడ్, మెటల్ డిటెక్టర్లను కూడా అటవీ శాఖ వాడటం ద్వారా అటవీ, వన్యప్రాణి నేరాల గుర్తింపు, విచారణ వేగవంతం అవుతుందన్నారు.
సమావేశానికి హాజరైన అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ మాట్లాడుతూ .. వన్య ప్రాణి సప్తాహం ఉత్సవాల్లో పాల్గొన్న నిపుణులు అత్యంత విలువైన సూచనలు ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో అటవీ, వన్యప్రాణి సంపదను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలన్నారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్ లో తెలంగాణలో ఉన్న టైగర్ రిజర్వ్ లు, నేషనల్ పార్కులు, రక్షిత అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులు చర్చించారు.
ఈ సెమినార్ లో ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పి.కె. ఝా, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (వైల్డ్ లైఫ్ ) డాక్టర్ మనోరంజన్ భాంజా, అరణ్య భవన్ లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్లు, అన్ని జిల్లాల అటవీ శాఖ ఉన్నతాధికారులు, జంతు సంరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.