అటవీ భూమిని, సంపదను కాపాడేందుకు పటిష్ట చర్యలు

అటవీ భూమిని, సంపదను కాపాడేందుకు పటిష్ట చర్యలు

రక్షిత అటవీ భూమి చుట్టూ కందకాల తవ్వకం ద్వారా రక్షణ

ఈ నెల 24 నుంచి 26 మధ్య అడవుల్లో నీటి వసతిపై సర్వే

కొత్తగా జిల్లాకు ఒకటి చొప్పున పట్టణ ప్రాంత అటవీ పార్కులు

అటవీ సంపదను, భూమిని ప్రతీ అంగుళం కాపాడాలని అందుకోసం శాఖ సిబ్బంది నిబద్దతతో పనిచేయాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అటవీ భూమి రక్షణలో భాగంగా అన్ని రిజర్వ్ అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో రక్షిత అటవీ ప్రాంతానికి సుమారు
24 వేల కిలో మీటర్ల సరిహద్దు పరిధి ఉందని, సాధ్యమైనంత వరకు కందకాల తవ్వకం పూర్తి చేయాలన్నారు. అటవీ భూమి చుట్టూ కందకాలు తీయటం ద్వారా వణ్యప్రాణులు అడవి దాటకుండా చూడటంతో పాటు, ఆక్రమణలను కూడా అడ్డుకోవచ్చన్నారు. అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో, ఉన్నతాధికారులు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో అడవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వణ్యప్రాణులకు నీటి వసతి, అగ్ని ప్రమాదాల నివారణపై సమీక్షించారు. ఈ నెల 24 నుంచి 26 మధ్యలో అడవుల్లో నీటి వనరుల లభ్యతపై సర్వే చేయనున్నట్లు పీసీసీఎఫ్ పీ.కే. ఝా ప్రకటించారు. గత నెలలో పులుల జనగణనలో పాల్గొన్న వాలంటీర్ల సహకారం ఇందుకోసం తీసుకోనున్నారు. అదే సమయంలో నీటి వసతి దగ్గర జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసే ఉచ్చులను కూడా గుర్తించి తొలగించే చర్యలు కూడా తీసుకోనున్నారు. వేసవిలో జంతువులకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అటవీ ప్రాంతాల్లో ఎక్కువ అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున, గుర్తించిన 430 ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈయేడు ఎలాంటి అగ్ని ప్రమాదాలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాలను మరింత అభివృద్ది చేయాలని సీ.ఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రతీ జిల్లాలో కొత్తగా ఒక ఫారెస్ట్ అర్బన్ పార్క్ ను అభివృద్ది చేయాలని, వాటిల్లో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల వద్ద రోడ్లకు ఇరువైపులా చక్కని మొక్కలతో ఎవెన్యూ ప్లాంటేషన్ ను కనీసం 5 కిలో మీటర్ల నుంచి 20 కిలో మీటర్ల దాకా చేయాలని ఆదేశించారు. వచ్చే హరితహారం కోసం నర్సరీలను సిద్దం చేయాలని, ప్రజలు కోరుకున్న, కనీస ఎత్తు ఉన్న మొక్కలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ బగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలకు అవసరమైన అటవీ అనుమతులు, తాజా పరిస్థితిపై సమవేశంలో సమీక్షించారు. సులభతర వాణిజ్య విధానంలో మంచి రేటింగ్ సాధించే దిశగా అటవీ శాఖకు వచ్చే పిటీషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్ లు పీ.కె.ఝా, రఘువీర్, పృధ్వీరాజ్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు మునీంద్ర, లోకేష్ జైస్వాల్, డోబ్రియాల్, సునీల్ కుమార్, శోభ, తిరుపతయ్య పాల్గొన్నారు.

VIDEO CONFERNCE 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *