అచ్చంపేట ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష

అచ్చంపేట ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష

అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంటులో లక్ష ఎకరాలకు సాగునీరు.

ఉల్పర రిజర్వాయర్ తో ఒక్క ఎకరం కూడా ముంపు కాదు..

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా తలపెట్టిన ఉల్పర రిజర్వాయర్ తో ముంపు ఉండదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. అతితక్కువ ముంపుతో,రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టులను రీ డిజైను చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.బుధవారం ఇక్కడ జలసౌధలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం లోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఉల్పర రిజర్వాయర్ నిర్మాణం వల్ల ముంపునకు గురవుతామనే భయాందోళనలు అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.ఈ రిజర్వాయర్ సామర్ధ్యం పై జరుగుతున్న ఊహగానాలను నమ్మవద్దని ఆయన కోరారు. 3 టి.ఏం.సి.లు లేదా 1 టి.ఏం.సి.లతో కెపాసిటీతో రిజర్వాయర్ కడుతున్నారనే ప్రచారాన్ని మంత్రి ఖండించారు. కేవలం .25 టి.ఏం.సి.లతోనే ఉల్పర రిజర్వాయర్ ను నిర్మిస్తున్నట్టు హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ రిజర్వాయర్ పరిధిలో దాసరాజుపల్లి గ్రామం ముంపునకు గురవుతుందనే ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురి కాదన్నారు. భూ నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం తగిన పరిహారం చెల్లిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.డిండి చీఫ్ ఇంజనీర్ సునీల్, రెవెన్యూ అధికారులతో కలిసి స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను ఆంచనా వేస్తారని మంత్రి తెలిపారు.ఉల్పర రిజర్వాయర్ కింద రెండు పంటలకు నీళ్లందుతాయని, మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభించనున్నదని మంత్రి అన్నారు. ప్రస్తుతం పంటలు వేసుకొని ఉన్నందున దిగుబడి వచ్చేవరకు కాలువల తవ్వకం జరగదని కూడా హరీష్ రావు చెప్పారు.రెండు, మూడు నెలల తర్వాత ఆర్.డి.ఓ.ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.కాలువల వెడల్పు తగ్గించి, భూసేకరణ తగ్గించాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.దీనిపై ప్రత్యామ్నాయాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హరీష్ రావు రైతులకు హామీ ఇచ్చారు.సముద్రానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న ఆమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించాలని అచ్చంపేట శాసన సభ్యుడు బాలరాజు మంత్రికి విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి అచ్చంపేట నియోజకవర్గానికి 50 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఒక లక్ష ఎకరాలకు సాగునీరందించెందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈ.ఎన్.సి. మురళీధర్ రావు,సి.ఈ.ఎస్.సునీల్,సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

harish rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *