
ఇవ్వాళ హైదరాబాద్ లోని సమాచార్ భవన్ లో జరిగిన రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సమావేశం క్రింది నిర్ణయాలు తీసుకుంది.
కమిటీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, అక్రెడిటేషన్ కార్డుల దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలోకి మార్చడం ద్వారా పారదర్శకత ఏర్పడిందన్నారు. ఈ విధానం ద్వారా అర్హతలేని వారు దరఖాస్తు చేసుకునే అవకాశమే లేదన్నారు. గత నాలుగేళ్లుగా కమిటీ సభ్యుల సహకారంతో సామరస్య వాతావరణంలో చర్చిస్తూ అర్హులైన జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్ కార్డులు మంజూరీ చేయగలిగినట్లు చెప్పారు.
*టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల హక్కులకు, మీడియాకు స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు మీడియా కమీషన్లు చేసిన సిఫారసుల మేరకు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు, అక్రెడిటేషన్ రూల్స్ రూపొందించడం జరిగిందన్నారు. వాటిని గౌవించాల్సిన బాధ్యత అక్రెడిటేషన్ కమిటీపై ఉందన్నారు. వెలుగు, ప్రజాపక్షం పత్రికలకు అక్రెడిటేషన్ కార్డుల అర్హత లేకుండా చేయడమంటే అక్రెడిటేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘిచడమేనని విరాహత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఆ రెండు పత్రికలకు కమిటీ న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ అంశంపై మిగితా సభ్యులు తమ అభిప్రాయాల్ని తెలపాలని అల్లం నారాయణ కోరగా, విరాహత్ విజ్ఞప్తికి తాము ఏకీభవిస్తున్నట్లు ప్రకటించడంతో, వెలుగు, ప్రజాపక్షం పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు కమిటీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లు అనే పదాలకు స్వస్తి పలికి అక్రెడిటేషన్ కార్డుల్లో వీడియో జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు పదాలు వినియోగించాలని విరాహత్ కోరగా, కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
*కమిటీ సభ్యులు టి.కోటి రెడ్డి మాట్లాడుతూ ఆన్ లైన్ దరఖాస్తుల మూలంగా సాంకేతిక సమస్యలు నెలకొని దరఖాస్తుదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్ స్పందిస్తూ, సాంకేతిక సమస్యలను నివారించేందుకు ఎప్పడికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
*కమిటీ సభ్యులు కట్టా కవితా, సౌమ్యా లు మాట్లాడుతూ, అక్రెడిటేషన్ కార్డుల మంజూరిలో మహిళలకు కేటాయించిన కోటను అన్ని మీడియా సంస్థలు తూచాతప్పకుండా అమలు చేసేందుకు కమిటీ చర్యలు చేపట్టాలని కోరారు.
*కమిటీ సభ్యులు సతీష్, బస్వపున్నయ్య, గంగాధర్, ప్రకాష్ లు వివిధ అంశాలను ప్రస్తావించగా, కమిటీ చర్చించి తీర్మానాలను ఆమోదించింది.