
సబ్ ఎడిటర్ల ఆందోళన జిల్లాల నుంచి హైదరాబాద్ కు చేరింది. అక్రిడిటేషన్ల కోసం పోరు ఉధృతమైంది. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల దరఖాస్తు గడువు ఈనెల 11తో ముగియడంతో సబ్ ఎడిటర్లు తమకు అవకాశం కల్పించాలని ఆందోళనకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ లో అన్ని పత్రిక ల సబ్ ఎడిటర్లు డీపీఆర్వోను కలిసి వినతిపత్రం అందజేశారు. సబ్ ఎడిటర్లకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని జీవో రాలేదని డీపీఆర్వో తెలపగా.. చలో హైదరాబాద్ ప్లాన్ చేశారు..
మంగళవారం వివిధ పత్రికల్లో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లంతా మూకుమ్మడిగా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ కు పయనమయ్యారు. హైదరాబాద్ లోని ఐఅండ్ పీఆర్ కార్యాలయం వద్ద తెలంగాణలోని పది జిల్లాల సబ్ ఎడిటర్లు ఆందోళన, ధర్నా నిర్వహించారు. కమిషనర్ చాంబర్ ఎదుట బైటాయించి ఆందోళన చేశారు. వెంటనే అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం తో మాట్లాడి సబ్ ఎడిటర్లకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది..
పక్కనున్న ఏపీ రాష్ట్రంలో డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలంటూ సర్క్యూలర్ జారీ అయ్యిందని.. అదే విధంగా ఇక్కడ కూడా అందించాలని కోరారు. హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే తేదీని మార్చాలని డెస్క్ జర్నలిస్టులు విన్నవించారు.