
ఆక్రమణలు, కలప నరికివేతపై అటవీ శాఖ ఉక్కుపాదం
కలపను కొట్టినా, దాచిపెట్టనా, రవాణా చేసినా కఠినమైన చర్యలు
భద్రాద్రి కొత్తగా చెట్లు నరికివేత, కలప రవాణాపై అత్యంత కఠినంగా ఉంటామని అటవీ శాఖ ప్రకటించింది.
ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడటంతో పాటు కొత్తగా మరింత పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా కృషి చేస్తోంది. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఇందులో భాగమౌతున్నారు. అయితే చట్టపరిధిలో ఉన్న నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నా, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆటవీ ఆక్రమణలు, విలువైన చెట్ల ఆక్రమ కొట్టి వేతలు, కలపను దాచిపెట్టడం, రవాణా చేయటం కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలపై అటవీ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అటవీ ప్రాధాన్యతను ఆయా గ్రామాలు, ప్రజలకు తెలిసేలా చెప్పటం, తగిన ప్రచారం కల్పించటం కూడా చేస్తోంది. అయినా చట్టపరిధిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరిస్తోంది. దీనిలో భాగంగా గుర్తించిన ప్రాంతాలు, గ్రామాల్లో సోదాలు చేస్తున్నారు అటవీ అధికారులు, సిబ్బంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో అటవీ అక్రమాలకు అడ్డాగా మారిన పాండురంగాపురంపై అటవీ శాఖ తనిఖీలు చేసింది. ఈ గ్రామం ఆది నుంచి కలప రవాణా, స్మగ్లింగ్ కార్యాక్రమాలకు నిలయంగా ఉంటోంది. ఎన్ని సార్లు హెచ్చరించినా తీరు మారకపోవటంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి పెద్ద ఎత్తున కలపను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అటవీ అధికారి శివాల రాంబాబు, ఎఫ్ డీ వో సుతాన్ నేతృత్వంలో 150 మంది టెరిటోరియల్, వైల్డ్ లైఫ్, స్ట్రయికింగ్ ఫోర్స్ సిబ్బంది గ్రామాన్ని జల్లెడ పట్టారు. గ్రామస్థులు తీవ్రంగా ప్రతిఘటించినా, ఎఫ్ డీ ఓ వాహనంపై దాడి చేసినా అటవీ సిబ్బంది వెనక్కుతగ్గలేదు. ఇళ్లు, మిద్దెలు, పెరడు, పశువుల కొట్టాల్లో దాచి పెట్టిన సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన టేకు, మారుతి జాతి కలపను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ, భద్రాచలం రేంజ్ ల్లో ఉన్న ఏడు కలప కోత డిపోలపై కూడా అధికారులు దాడులు చేసి, సోదాలు నిర్వహించారు. గత పదేళ్లలో పాండురంగాపురంపై అటవీ శాఖ దాడులు చేయటం ఇదే మొదటిసారి. ప్రతీసారి సిబ్బంది వచ్చే సమాచారం తెలుసుకుని, గ్రామస్థులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగేవారు. ఈ సారి మాత్రం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది వెనక్కుతగ్గకుండా, దాడులకు వెరవకుండా సోదాలు కొనసాగించారు. అడవుల్లో చెట్లు నరికినా, అక్రమంగా కలపను దాచిపెట్టినా, రవాణా చేసినా తమకు సమాచారం ఇవ్వాలని, చట్ట ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన దాడులు కొనసాగుతాయని, పోలీసులు, రెవెన్యూ శాఖ సహకారంతో ఆక్రమణలు, కలప నరికివేతను అణిచివేస్తామని, పీడీ యాక్టు ప్రకారం కేసులు పెడతామని అధికారులు ప్రకటించారు.